బహుజన సమాజ్ పార్టీ (BSP) ఆధ్వర్యంలో కొల్హాపూర్ సామాజిక సంస్థానాధీశుడు చత్రపతి సాహు మహారాజ్ జయంతి వేడుకలు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సాహు మహారాజ్ సేవలను స్మరించుకున్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చార్వక ENT ట్రస్టు నందు BSP నాయకులు, కార్యకర్తలు చత్రపతి సాహు మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచుకొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, చత్రపతి సాహు మహారాజ్ బహుజనులకు రిజర్వేషన్లు కల్పించి, సామాజిక సంస్థానంగా కొల్హాపూర్ సంస్థానాన్ని తీర్చిదిద్దారని తెలిపారు. ఆయన ఆశయాలు, ఆచరణలు నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
డాక్టర్ అంబేద్కర్ విద్యకు, 'ముక్ నాయక్' పత్రికకు సాహు మహారాజ్ అందించిన సహకారాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 1920లో జరిగిన దక్కన్ అస్పృశ్య సమాజ సమ్మేళన సభలో అంబేద్కర్ ఆశయాలతోనే భవిష్యత్తు ముందుకు సాగుతుందని ఆయన ప్రకటించారని తెలిపారు.
ఉద్యోగాలు, భూమి పట్టాలు కల్పించడంతో పాటు, వితంతు వివాహ చట్టం, కులాంతర వివాహాలను ప్రోత్సహించారని, ఒక సామాన్యుడికి ఆర్థిక సహాయం చేసి హోటల్ పెట్టించిన గొప్ప మనసున్న మహానుభావుడని ముల్కల్ల రాజేంద్రప్రసాద్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీలోని పలువురు నాయకులు పాల్గొన్నారు.











