త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను పరస్పర సహకారంతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి పిలుపునిచ్చారు. పండుగ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీస్ యంత్రాంగం అన్ని రకాల చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు.
గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ముస్లిం, హిందూ, క్రిస్టియన్ మత పెద్దలతో పోలీసుల శాంతి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు పండుగ రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమాజంలో మత సామరస్యం, ఐక్యత నెలకొనేలా అన్ని వర్గాల ప్రజలు ఒకరి మత విశ్వాసాలను మరొకరు గౌరవిస్తూ, సోదరభావంతో బక్రీద్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు.
పశువులను తరలించే వాహనాలను అడ్డుకోవడం, వ్యక్తులపై దాడులు చేయడం, బలవంతంగా తనిఖీలు నిర్వహించడం వంటి చర్యలకు ఎవరూ పాల్పడరాదని, చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకోవద్దని డీసీపీ హెచ్చరించారు. ఎక్కడైనా అనుమానాస్పద వాహనాలు లేదా అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
పండుగ నేపథ్యంలో ఎలాంటి అపోహలు, వదంతులు వ్యాప్తి చెందకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికల ద్వారా వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని, వాటిని ఇతరులకు షేర్ చేయవద్దని సూచించారు. ప్రభుత్వం అనుమతించిన నిర్ణీత ప్రదేశాల్లోనే జంతువధ (ఖుర్బానీ) నిర్వహించాలని తెలిపారు.
బహిరంగ ప్రదేశాల్లో జంతు అవశేషాలను పారవేయకుండా పరిశుభ్రత పాటిస్తూ మున్సిపల్ సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఏవైనా సమస్యలు ఉంటే పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.











