ముదిరాజుల హక్కుల సాధన కోసం ఐక్యంగా, సమిష్టిగా ముందుకు సాగాలని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. వారి సంఖ్యాబలాన్ని సామాజిక, రాజకీయ బలంగా మార్చుకోవాలని, కులగణన వివరాలను విధాన నిర్ణయాలకు ఉపయోగించుకోవాలని సూచించారు.
ముదిరాజుల సమస్యలు, రిజర్వేషన్లు, సామాజిక అభివృద్ధి వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తాను ఎప్పటికీ వెనుకడుగు వేయబోనని మంత్రి స్పష్టం చేశారు. ముదిరాజుల కోసం ఏ అవకాశం వచ్చినా, నా పదవిని నా వ్యక్తిగత ప్రయోజనానికి కాకుండా జాతి ప్రయోజనానికి ఉపయోగించడమే నా లక్ష్యం అని మంత్రి పేర్కొన్నారు.
ముదిరాజులు సంఖ్యాపరంగా బలమైన సామాజిక వర్గమని, స్థానిక సంస్థల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లుగా అనేక మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారని మంత్రి అన్నారు. ఈ సంఖ్యాబలాన్ని మరింత రాజకీయ, సామాజిక ప్రాతినిధ్యంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు.
కులగణనతో సంఖ్యాబలం స్పష్టం
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో ముదిరాజుల జనాభా సుమారు 26.36 లక్షలు, 7.43 శాతంగా నమోదైనట్లు తాజా ప్రచురిత వివరాలు వెల్లడిస్తున్నాయని మంత్రి తెలిపారు. ఈ గణాంకాలు ముదిరాజుల సంఖ్యాబలాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయని, ఈ సమాచారాన్ని విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమం వంటి అంశాల్లో విధానపరమైన చర్చలకు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు.
కులగణనలో లభించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగేలా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు.
పండుగ సాయన్న స్ఫూర్తితో ముందుకు సాగాలి
ముదిరాజుల చరిత్రలో పండుగ సాయన్న ఒక గొప్ప స్ఫూర్తి అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. పేదలు, బడుగు వర్గాల కోసం పోరాడిన పండుగ సాయన్న వారసత్వాన్ని నేటి తరం ముందుకు తీసుకెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు.
పండుగ సాయన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వపరంగా గుర్తించే అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని, ముదిరాజు ప్రతినిధులతో కలిసి చేసిన ప్రయత్నాలకు ఫలితం లభించిందని మంత్రి తెలిపారు.
విద్యతోనే భవిష్యత్ మారుతుంది
ముదిరాజు కుటుంబాలు తమ పిల్లలను తప్పనిసరిగా ఉన్నత విద్య చదివించాలని మంత్రి సూచించారు.
ముదిరాజు బిడ్డ అమెరికాకు ఎందుకు వెళ్లకూడదు పెద్ద వ్యాపారవేత్త ఎందుకు కాకూడదు ఐఏఎస్, ఐపీఎస్ ఎందుకు కాకూడదు అని మంత్రి ప్రశ్నించారు.
సమాజ అభివృద్ధికి విద్యే ప్రధాన మార్గమని, ముదిరాజు యువత ఉన్నత విద్య, ఉద్యోగాలు, వ్యాపారం, సాంకేతిక రంగాల్లో ముందుకు రావాలని మంత్రి సూచించారు. సమాజంలో ఇప్పటికే అనేక మంది ముదిరాజులు ఉన్నత స్థాయికి ఎదిగారని, వారి సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు.










