సింగరేణి సంస్థకు రావాల్సిన బకాయిలను వసూలు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని, సంస్థ నిధుల దుర్వినియోగంపై దృష్టి సారించడం సరికాదని సీఐటీయూ (CITU) నాయకులు తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు హైదరాబాద్ విద్యుత్ సౌధ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ, సింగరేణి సంస్థ నుంచి ప్రభుత్వాలు CSR, డివిడెండ్ల రూపంలో భారీ మొత్తంలో నిధులను తీసుకుంటున్నాయని, అయితే సంస్థకు రావాల్సిన బకాయిల వసూలు విషయంలో మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. సంస్థ జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్నా, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
నాణ్యమైన పనిముట్లు, క్వార్టర్లు, ఆరోగ్య సంరక్షణ, సంక్షేమ కార్యక్రమాల అమలులో సంస్థ వెనుకబడిపోతోందని, దీనికి ప్రభుత్వాల విధానాలే కారణమని నాయకులు పేర్కొన్నారు. కొత్త గనులకు అనుమతులు నిరాకరిస్తూ, పాత గనులను మూసివేస్తూ, తక్కువ ధరకు బొగ్గు అమ్మాలని చెప్పడం సరికాదని, డివిడెండ్లు తీసుకుంటున్న ప్రభుత్వాలు సంస్థకు నిధులు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు.
రాజకీయ జోక్యం పెరగడం వల్ల సంస్థ కార్యకలాపాలు స్వతంత్రంగా సాగడం లేదని, సింగరేణి ఆస్తులను ఇతర పనులకు వాడుకుంటూ, సంస్థను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతున్నారని విమర్శించారు. భవిష్యత్తులో ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు కూడా నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు.
సమ్మెను వాయిదా వేసుకున్న ఏఐటీయూసీ నాయకులకు, కార్మిక సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే అన్ని సంఘాలతో కలిసి పనిచేయాలని సీఐటీయూ సూచించింది. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.






