వ్యవసాయంలో శాస్త్రీయ పద్ధతులను అవలంబించడం ద్వారా అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం చెన్నూరు మండలంలో రైతులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
చెన్నూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంపుదల, ప్రత్యామ్నాయ పంటల సాగు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వ్యవసాయ అధికారులతో, రైతులతో సమీక్ష నిర్వహించారు.
రైతులు ఒకే రకమైన పంట సాగు చేయకుండా పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని, కూరగాయలు, పప్పుధాన్యాలు వంటి వ్యాపార, వాణిజ్య పంటలపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ఒకే రకమైన పంట సాగు భూసారాన్ని తగ్గిస్తుందని ఆయన తెలిపారు.
ప్రభుత్వం సన్న రకం ధాన్యానికి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ అందిస్తోందని, కాబట్టి రైతులు సన్న రకం వడ్ల సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ఆయిల్ పామ్ సాగు ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందవచ్చని, తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే పంటలను ఎంచుకోవాలని తెలిపారు.
రైతు వేదికలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, పంట సాగులో అవసరమైన మెలకువలు అందిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. పంట సాగు సమయంలో రసాయన ఎరువులను అవసరం మేరకు మాత్రమే వాడాలని, అధికారులను సంప్రదించి సలహాలు తీసుకోవచ్చని సూచించారు. ఈ సందర్భంగా రైతులకు విత్తన కిట్లను అందజేశారు. అలాగే, పలు అభివృద్ధి పనులను కూడా ఆయన పరిశీలించారు.












