మంచేరియల్, జూలై 19, 2026
రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రైతులు వరి మినహా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేకానంద పిలుపునిచ్చారు. చెన్నూర్ పట్టణంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున నీటి కొరత ఏర్పడి వరి సాగులో నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించి లబ్ధి పొందాలని సూచించారు.
రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావాన్ని సమిష్టిగా ఎదుర్కొందామని, రైతులంతా ఏకమై ఒకే నిర్ణయంతో వరి మినహా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. ఆదివారం జిల్లాలోని చెన్నూర్ పట్టణంలో గల మైనారిటీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, మున్సిపల్ చైర్ పర్సన్ పెద్దింటి పద్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేష్ కుమార్ తివారి, వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఎల్ నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు వరి సాగు మినహా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 40 శాతం మాత్రమే వర్షపాతం నమోదు అయిందని, రాబోవు 3 నెలల లో కూడా ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని, ఇది ఒక ప్రకృతి విపత్తు లాంటిదని తెలిపారు. సాగునీరు, త్రాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని, ఈ కారణంగా ఈసారి నీటి లభ్యతలో లోటు ఉండడంతో వరి సాగులో నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు. నీటి ఇబ్బంది కారణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసి లబ్ధి పొందాలని, ఓకే నిర్ణయంతో ఈ సీజన్ లో వరి సాగు చేయవద్దని తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో రాబోవు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో లోటు వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని, నవంబర్ నెలలో వర్షం కురిసే అవకాశం ఉన్నా పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు. భూగర్భ జలం తక్కువగా ఉందని, రైతులు ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలని, పప్పుధాన్యాలు, పత్తి, కూరగాయలు, ఆయిల్ పామ్ వంటి నీరు తక్కువ అవసరం ఉన్న పంటలు సాగు చేయాలని, అవసరమైన రాయితీ విత్తనాలు, ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తక్కువ సమయంలో పంట చేతికి వచ్చే తక్కువ నీటి అవసరం ఉన్న పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందని, వ్యవసాయ విస్తరణ అధికారులు తమ పరిధిలోని గ్రామాలలో సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు వివరించడం జరుగుతుందని తెలిపారు. మండలాలు, గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించి ఆదాయం వచ్చే పంటలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, వరి సాగు కారణంగా నష్టం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. భూసార పరీక్షలు నిర్వహించి కార్డులు అందించడం జరుగుతుందని, పంట సాగుకు అనుగుణంగా యూరియా అందించడం జరుగుతుందని తెలిపారు. జూన్ మాసంలో రైతు భరోసా అందించడం జరిగిందని, రైతులు మార్కెట్ లో డిమాండ్ ఉన్న ఆదాయం వచ్చే పంటలు సాగు చేసి లబ్ధి పొందాలని తెలిపారు.
చెన్నూర్ మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో కొత్తగూడెం జంక్షన్ నుండి రావిచెట్టు పెద్ద చెరువు) జంక్షన్ వరకు 1 కోటి 40 లక్షల రూపాయల డి.ఎం.ఎఫ్.టి. నిధులతో నిర్మించిన బైపాస్ సి.సి. రోడ్డును జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, చైర్ పర్సన్, మార్కెట్ కమిటీ చైర్మన్ లతో కలిసి రాష్ట్రమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెన్నూర్ నియోజకవర్గంలో ప్రజల సౌకర్యార్థం రహదారులు, మురుగునీటి వ్యవస్థ, అంతర్గత రహదారుల నిర్మాణం చేపట్టి పనులు పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. పనులు ఉన్న ప్రాంతాలలో పనులను గుర్తించి, మంజూరు చేసి, పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. చెన్నూర్ మున్సిపల్ పరిధిలో చేపట్టిన రహదారి విస్తరణ పనులకు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా సహకరించడం అభినందనీయమని, పట్టణ అభివృద్ధిలో పాలు పంచుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. 6 కోట్ల 50 లక్షల రూపాయల పుష్కరాల నిధులు మంజూరు చేసి రహదారి అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. 1 కోటి 20 లక్షల రూపాయల డి.ఎం.ఎఫ్.టి. నిధులతో 20 షాపులను నిర్మించి నిరుపేద అర్హులైన వ్యాపారస్తులకు కేటాయించడం జరుగుతుందని, రోడ్డు విస్తరణలో భూమి కోల్పోయిన నిజమైన వ్యాపారస్తులకు 50 మందికి షాపులు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పట్టణంలోని శివాలయం ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది చెన్నూర్ పట్టణానికి బహుమతిగా ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మున్సిపల్ పరిధిలోని వార్డులలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా అంతర్గత రహదారులను పూర్తిస్థాయిలో నిర్మించడం జరుగుతుందని తెలిపారు. సంక్షేమ సతి గృహాలలో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించే దిశగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.











