రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో నాణ్యమైన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అధికారులను, రైస్ మిల్లుల నిర్వాహకులను ఆదేశించారు.
మంగళవారం జిల్లాలోని లక్షెట్టిపేట, జన్నారం, దండేపల్లి మండలాల్లోని పలు కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులు నిబంధనల ప్రకారం తాలు, తప్ప, తేమ లేకుండా ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఎఫ్ఏక్యూ నాణ్యతతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు, రైతులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
రైస్ మిల్లుల నిర్వాహకులు కొనుగోలు చేసిన ధాన్యాన్ని సకాలంలో దిగుమతి చేసుకొని, సీఎంఆర్ డెలివరీ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. జన్నారంలోని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ గోదామును, రాఘవేంద్ర రైస్ మిల్లును కూడా ఆయన పరిశీలించారు.
రైతులు కొనుగోలు కేంద్రాలలో అందుబాటులో ఉన్న ప్యాడి క్లీనర్లు, టార్పాలిన్లు, హస్క్ రిమూవర్స్ వంటి సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఈ తనిఖీలలో జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళ, ఆయా మండలాల తహసిల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.








