మంచేరియల్, 2026-06-30
రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఒక పండుగలా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక నుంచి రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రజా పాలనలో రైతు సంక్షేమం కీలకమని, వ్యవసాయాన్ని పండుగలా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఒక పండుగలా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక నుంచి రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తంకుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్, వాకాటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ప్రజా పాలన ప్రభుత్వంలో రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, వ్యవసాయాన్ని పండుగలా నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులను క్రమంగా సరిదిద్దుతున్నామన్నారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు ప్రతి నెలా 1వ తేదీన వేతనాలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.
2 లక్షల రూపాయల రైతు రుణమాఫీలో భాగంగా 25,35,000 మంది రైతులకు రూ.20,677 కోట్ల రుణమాఫీ చేశామని, రైతు భరోసా కింద ఎకరానికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు రూ.27,000 కోట్లు రైతు భరోసా ఖాతాల్లో జమ చేశామని, ప్రస్తుతం మరో రూ.9,000 కోట్లు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, మొత్తంగా రూ.36,000 కోట్లు రైతు భరోసా కోసం ఖర్చు చేస్తున్నామని వివరించారు.
వ్యవసాయ రంగంలో విద్యుత్ వినియోగానికి రూ.30,000 కోట్లు, బోనస్‌కు రూ.4,000 కోట్లు, పనిముట్లకు రూ.2,000 కోట్లు, రైతు బీమా పథకానికి రూ.3,500 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. పౌర సరఫరాల సంస్థ ద్వారా రైతుల వద్ద నుంచి 2,88,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రూ.80,000 కోట్లు సంబంధిత రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇప్పటివరకు వ్యవసాయ రంగానికి రూ.1,75,000 కోట్లు ఖర్చు చేశామని, సగటున ప్రతి నెలా రూ.6,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు.
నష్టాల్లో ఉన్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను రూ.1,000 కోట్ల లాభాల్లోకి తెచ్చామని, సింగరేణి, విద్యుత్, ఆర్థిక, వ్యవసాయ రంగాలను అభివృద్ధి చేశామని తెలిపారు. రెవెన్యూ శాఖలో భూ భారతి ద్వారా భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహిళల సంక్షేమంలో భాగంగా మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించి, రూ.11,000 కోట్లు ఆర్టీసీకి చెల్లించామని చెప్పారు.
మహిళల ఆర్థికాభివృద్ధికి సౌర విద్యుత్ ప్లాంట్ల నిర్వహణ, పెట్రోల్ బంకుల ఏర్పాటుకు అవకాశం కల్పించామని, హైదరాబాద్‌లో ఐటీ సంస్థల మధ్య రూ.1,000 కోట్ల విలువైన భూమిని ఇందిరా మహిళా భవన్‌కు కేటాయించి, స్వయం సహాయక సంఘాల ద్వారా 150 షాపులు ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 8,000 స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, జిల్లా కేంద్రాలలో ఇందిరా మహిళా శక్తి భవనాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.












